పాస్‌వర్డ్ కాపాడుకోకపోతే… డబ్బు, గుర్తింపు, జ్ఞాపకాలన్నీ ప్రమాదంలో!
గత వారం ఇంటర్నెట్‌లో భారీ కలకలం. ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ పాస్‌వర్డ్స్ (భారతీయుల దృష్టిలో 1,600 కోట్ల లాగిన్ వివరాలు) డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు, గూగుల్ ధృవీకరించిన ఈ లీక్, ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డేటా ఉల్లంఘనగా గుర్తింపు పొందింది.
ఈ నేపథ్యంలో డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకులు నికీలు గుండ హెచ్చరించారు – “మీ పాస్‌వర్డ్ కేవలం ఓ కీ కాదు, అది మీ డిజిటల్ ఐడెంటిటీ. డబ్బు, జ్ఞాపకాలు, గుర్తింపు అన్నింటినీ కాపాడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.”
అసలు ప్రమాదం – మన అలవాట్లలోనే!
ఒకే పాస్‌వర్డ్‌ను అన్ని సైట్లలో వాడటం, పబ్లిక్ వై-ఫైలో లాగిన్ అవ్వడం, “సస్పిషస్ లాగిన్” అలర్ట్‌లను పట్టించుకోకపోవడం… ఇవన్నీ డిజిటల్ భద్రతకు ప్రధాన ముప్పు.
“123456, iloveyou, Telangana@123, పేరు లేదా పుట్టిన తేదీ వంటి సులభమైన పాస్‌వర్డ్స్ వాడటం, అన్ని అకౌంట్స్‌కి ఒకే పాస్‌వర్డ్ పెట్టడం, ఫోన్‌కి వచ్చిన OTPలను తెలియని వ్యక్తులతో పంచుకోవడం… ఇవన్నీ అత్యంత ప్రమాదకరం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క పాస్‌వర్డ్ లీక్ అయితే…
మీ Gmail పాస్‌వర్డ్ లీక్ అయితే, Google Drive, ఫొటోలు, డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా, OTPలు, Aadhaar/PAN వంటి వ్యక్తిగత సమాచారం అన్నీ హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెకన్లలోనే జీవితాంతం గుర్తుండిపోయే నష్టం జరగొచ్చు.
డిజిటల్ భద్రతకు తొమ్మిది కీలక సూచనలు
- ప్రతి ప్లాట్‌ఫామ్‌కు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్ వాడండి
- 2-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్ చేయండి
- Google Password Manager, Bitwarden, 1Password వంటివి వాడండి
- మీ పాస్‌వర్డ్ లీక్ అయిందా తెలుసుకోండి: Google Password Checkup లేదా haveibeenpwned.com
- తెలియని లింక్స్, డీఎంలను క్లిక్ చేయవద్దు
- పబ్లిక్ వై-ఫైలో సెన్సిటివ్ అకౌంట్స్ యాక్సెస్ చేయవద్దు
- ఫోన్లు, కంప్యూటర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి
- లాగిన్ అలెర్ట్స్ ఆన్ చేయండి
- కుటుంబ సభ్యులు, టీమ్‌కు కూడా అవగాహన కల్పించండి
AI అభివృద్ధితో కొత్త ముప్పులు
AI వల్ల డీప్‌ఫేక్స్, ఫిషింగ్ బాట్స్, ఆటోమేటెడ్ పాస్‌వర్డ్ క్రాకింగ్ లాంటి ముప్పులు పెరుగుతున్నాయి. కాబట్టి, పాస్‌వర్డ్‌నే కాదు, డిజిటల్ అలవాట్లను కూడా మార్చుకోవాలి.
చివరగా…
“నన్ను ఎవరు హ్యాక్ చేస్తారు?” అని నిర్లక్ష్యం చేయొద్దు. హ్యాకర్లు ప్రత్యేకంగా లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు; బలహీనమైన పాస్‌వర్డ్ ఉంటే చాలు – అది ఓపెన్ డోర్ లాంటిది.
పాస్‌వర్డ్ భద్రత అనేది టెక్నాలజీ విషయం కాదు – జీవిత నైపుణ్యం. విద్యార్థి, గృహిణి, ఉద్యోగి, వ్యాపారవేత్త… ఎవరికైనా ఇది అవసరం. మీ పాస్‌వర్డ్‌ను కాపాడుకోండి – డిజిటల్ ప్రపంచంలో మీ గుర్తింపును కాపాడుకున్నట్టే!