కర్నూలు: హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కర్నూలులో ఘనంగా నిర్వహించిన హరి ఉదాన్ 2026 – స్టేట్ మెరిట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన 700 మందికి పైగా ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్థులను గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను గౌరవిస్తూ, ఉన్నత విద్య మరియు భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించే వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఏఐ నిపుణుడు, సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అన్ని రంగాల్లో విస్తరిస్తోందని, రాబోయే కాలంలో AI నైపుణ్యాలు ప్రతి విద్యార్థి కెరీర్లో కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన అన్నారు.
సంప్రదాయ విద్యతో పాటు AI, డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా విద్యార్థులు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం మంచి మార్కులు సాధించడం మాత్రమే సరిపోదని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, నిరంతర అభ్యాసం విజయానికి కీలకమని ఆయన అన్నారు. యువత తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన దృష్టితో ముందుకు సాగితే ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.
AI అనేది ఉద్యోగాలను భర్తీ చేసే సాంకేతికత కాదని, మన సామర్థ్యాన్ని మరింత పెంచే శక్తివంతమైన సాధనమని నికీలు గుండా వివరించారు. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించగల యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారని పేర్కొన్నారు.
హరి ఉదాన్ 2026 వేదికపై మెరిట్ విద్యార్థులతో నేరుగా మమేకమైన నికీలు గుండా, ఉన్నత విద్యతో పాటు AI ఆధారిత భవిష్యత్ నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తూ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం, విద్యా ప్రోత్సాహం మరియు సాంకేతిక అవగాహనను ఒకే వేదికపై అందించిన విశిష్ట కార్యక్రమంగా నిలిచింది.







