Elon Musk: కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలంటారు. లేదంటే వ్యవహారం బెడిసికొడుతుందంటారు. ఎలోన్ మస్క్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడాయన నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రైట్ హ్యాండ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ చెలరేగిపోతున్న మస్క్‌ను ప్రస్తుతం ట్రంప్ కొంత పక్కనబెట్టినట్టుగా ఉంది.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు దగ్గర్నుంచి, ఆఫ్రికా, చైనా, ఇలా ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపెడుతూ రెచ్చిపోతున్న మస్క్‌కు తాజాగా షేర్ మార్కెట్ మస్కా కొట్టింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సంపద ఒక్కదెబ్బతో బ్యార్ మంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆదివారం మస్క్ నికర విలువ $330 బిలియన్లు. సోమవారం సాయంత్రం $301 బిలియన్లకు తగ్గింది. ఒక్కరోజులో 6.7% క్షీణించింది. సోమవారం ఒక్క రోజే, మస్క్ సంపద $29 బిలియన్లు అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలన్నమాట. డిసెంబర్ 2024లో $486 బిలియన్లకు చేరుకున్న నికర విలువ, ఈ సంవత్సరం ప్రారంభం నుండి $132 బిలియన్లు తగ్గింది. మార్కెట్లోకి మస్క్ తీసుకొచ్చిన టెస్లా కార్లే ఈ మొత్తం వ్యవహారానికి కారణమన్న అభిప్రాయంకూడా ఉంది.
తగ్గుతున్న అమ్మకాలతోపాటుగా, అమెరికా ప్రభుత్వ సామర్థ్య శాఖ డోజ్ చీఫ్‌గా మస్క్ వేస్తున్న వేషాలతో ఆయనపై అమెరికన్లలో చిరాకు ఎక్కువవుతోంది. కంపెనీ అమ్మకాలు క్షీణించడంతోపాటుగా, జర్మనీలో ఆర్డర్లు 70% తగ్గడం, చైనాలో షిప్మెంట్లు 49% తగ్గడంతో మొత్తం పరిస్థితి ఆగమాగమవుతోంది. టెస్లా స్టాక్ మార్చి 10, సోమవారం నాస్డాక్లో 15.43% తగ్గి $40.52 వద్ద ముగిసింది.
సెప్టెంబర్ 2020 తర్వాత ఈ రకంగా పడిపోవడం ఇదే మొదలు. నాడు 21.1% పడిపోయి $110కి చేరుకుంది. మార్కెట్ తిరోగమనంలో భాగం, నాస్డాక్ 100 పాయింట్లు పడి 4% పడిపోయింది. S&P 500 పాయింట్లు పడిపోయి 3% నష్టపోయింది.
ట్రంప్ సర్కారు పన్నులు, సుంకాలతో అమెరికా ఆర్థక రంగం దెబ్బతింటోంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారీ అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు విలవిలాడుతున్నాయి. భారీగా మార్కెట్లు దిబ్బతినడంపై మస్క్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తానన్నాడు. లాంగ్ రన్లో షేర్లు రికవరీ అవుతాయన్నాడు.
సోమవారం ఎక్స్ సైబర్ దాడితో విలవిలలాడింది. పెద్ద ఎత్తున సైబర్ దాడి వల్ల ఈ అంతరాయానికి కారణమని ఎలోన్ మస్క్ అన్నాడు. మొత్తంగా ప్రభుత్వంలో చేరడం వల్ల తనకు కష్టాలు మొదలయ్యాయన్న భావనలో మస్క్ ఉన్నాడు. అధికారానికి దూరంగా ఉంటేనే బెటరా అన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.